మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంచలనం సృష్టించిన ఆటో డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన భార్యను సుమారు ఒకటిన్నర నెలల తర్వాత థానే పోలీసులు అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న ఆమెను థానేలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నాగ్‌పూర్ పోలీసులకు అప్పగించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్‌పూర్‌లోని అజ్ని ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఆటో డ్రైవర్ గౌరవ్ రగ్దేకి, దీపాలి అలియాస్ బాలి విజయ్ సాలుంకే (29) అనే యువతితో ఎనిమిది నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం జరిగింది. అయితే కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో దీపాలి తన భర్తను వదిలి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలోనే దీపాలికి రిషికేశ్ ఖోడే అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న గౌరవ్ రగ్దే తన భార్యతో గొడవ పడ్డాడు.
గత ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం నాగ్‌పూర్‌లోని నరేంద్ర నగర్ ప్రాంతంలో భార్య దీపాలి, ప్రియుడు రిషికేశ్ ఖోడేతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు గౌరవ్ వెళ్లాడు. ఆ సమయంలో రిషికేశ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గౌరవ్‌కు, ఆ ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీపాలి ప్రోద్బలంతోనే రిషికేశ్, అతని స్నేహితులు నాలా బ్రిడ్జ్ సమీపంలో గౌరవ్‌పై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గౌరవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ హత్య జరిగినప్పటి నుంచి థానేలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రోడ్ నివాసి అయిన దీపాలి పోలీసులకు చిక్కకుండా తలదాచుకుంటూ వస్తోంది. థానే క్రైమ్ బ్రాంచ్ యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ శైలేష్ సల్వి నేతృత్వంలో నిందితురాలిని శనివారం థానేలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను నాగ్‌పూర్‌లోని బెల్టరోడి పోలీసులకు అప్పగించామని, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

