రాష్ట్రంలో ఎల్‌నినో రైతాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ముందస్తు ప్రణాళికలు, సాంకేతిక సూచనల ద్వారా రైతులకు అండగా నిలుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
సచివాలయంలో రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ శాఖ రూపొందించిన 'ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం' అనే ప్రత్యేక సమాచార సంచికను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, వర్షపాతం లోపాలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ వాతావరణ మండలాలకు అనుగుణంగా పంటల ఎంపిక, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి యాజమాన్య పద్ధతులు, నేల తేమ సంరక్షణ చర్యలు, విత్తనాల వినియోగం, పంటల సంరక్షణకు సంబంధించిన సమగ్ర సూచనలను ఈ సమాచార సంచికలో పొందుపరిచినట్లు తెలిపారు. రైతులు ఈ సూచనలను పాటించడం ద్వారా వాతావరణ ప్రతికూల పరిస్థితులను అధిగమించి దిగుబడులను కాపాడుకోవచ్చన్నారు.
వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ, సహకార శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే చర్యలను అమలు చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వాతావరణ హెచ్చరికలు, పంటల నిర్వహణ సూచనలు గ్రామ స్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వాతావరణ నిపుణుల సూచనల ఆధారంగా రూపొందించిన ఈ ప్రత్యేక సంచిక రైతులకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పంటల వారీగా, ప్రాంతాల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే పద్ధతులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనే వ్యవసాయ నిర్వహణ చర్యలు ఇందులో పొందుపరచినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి వాతావరణ సవాళ్లు ఎదురైనా రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలో రైతులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రత్యేక సమాచార సంచిక ద్వారా రైతులు శాస్త్రీయ అవగాహన పెంపొందించుకొని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నష్టాలను తగ్గించుకునే అవకాశం కలుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

