ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో తీపి కబురు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు త్వరలోనే పెద్ద ఎత్తున అధునాతన ఏసీ బస్సులను రోడ్లపైకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం అమలు చేయనున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సాధారణ ఆర్టీసీ బస్సులకే పరిమితం చేయకుండా, రాబోయే సరికొత్త ఏసీ బస్సుల్లోనూ మహిళలకు వర్తింపజేస్తామని సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారు.
అలాగే, పర్యావరణహిత రవాణా కోసం త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను (ఈ-బస్సులు) కూడా ప్రవేశపెడుతున్నామని, ఈ బస్సులను మహిళా డ్రైవర్లే నడిపేలా వారిని ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారత, సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు.

