Dailyhunt
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 51 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన

ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 51 మంది ప్రభుత్వ వైద్యులకు ఉద్వాసన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను పెంచేందుకు, సిబ్బందిలో క్రమశిక్షణను పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

విధులకు దీర్ఘకాలంగా అనధికారికంగా గైర్హాజరవుతున్న వైద్యులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేస్తూ.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) పరిధిలోని 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఎవరెవరిపై వేటు పడింది?

శాశ్వత ఉద్వాసనకు గురైన 51 మంది వైద్యులలో వివిధ బోధనాసుపత్రులకు చెందిన కింది స్థాయి అధికారులు ఉన్నారు:

అసోసియేట్ ప్రొఫెసర్లు: 8 మంది

అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 41 మంది

ట్యూటర్లు: ఇద్దరు

వీరితో పాటు మరో ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లపై కూడా త్వరలోనే కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

తొలగింపునకు గురైన వారిలో కొందరు ఆరేళ్ల నుంచి, మరికొందరు ఏడేళ్ల నుంచి విధులకు రాకుండా సొంత వ్యాపారాలు, క్లినిక్‌లు నడుపుకుంటున్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్-1964 నిబంధనల ప్రకారం.. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి మించి విధులకు గైర్హాజరైతే, వారు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగానే పరిగణించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నిబంధనల మేరకే సదరు వైద్యులకు ముందస్తుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ ఇచ్చుకోవడానికి తగిన సమయం ఇచ్చారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

మరో 33 మందికి వార్నింగ్:

ఏడాది లోపు కాలంగా విధులకు గైర్హాజరవుతున్న మరో 33 మంది వైద్యులకు (ఇందులో ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు) ప్రభుత్వం ఛార్జిమెమోలు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా వీరు తిరిగి విధుల్లో చేరని పక్షంలో, వీరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ కఠిన వైఖరితో భయపడిన 11 మంది వైద్యులు ఇప్పటికే తిరిగి విధుల్లో చేరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu