ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా సరికొత్త పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్ 'మన మిత్ర' ను భారీగా విస్తరించింది.
ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 1,126 సేవలను పౌరులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 58.2 లక్షల మంది పౌరులు ఈ సేవలను వినియోగించుకోగా, 3.42 కోట్లకు పైగా సర్వీస్ సెషన్లు నమోదైనట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే ఒక్క డిజిటల్ ఇంటర్‌ఫేస్ (వాట్సాప్) ద్వారా సేవలు పొందేలా దీనిని తీర్చిదిద్దారు.
గ్రాండ్ డిజిటల్ పుష్‌లో భాగంగా ప్రభుత్వం 'ఏఐ-ఎనేబుల్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్' ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పౌరులు తమ ఫిర్యాదులను టెక్స్ట్, ఇమేజ్ లేదా వాయిస్ మెసేజ్ రూపంలో చాట్ చేస్తూ నమోదు చేయవచ్చు. జూన్ 2024 నుండి ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 17.6 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. అలాగే, విపత్తులు, వాతావరణం, వ్యవసాయం, ప్రజారోగ్యం వంటి అంశాలపై ముందస్తు సమాచారం అందించేందుకు 'అవేర్' ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చారు. ఇది అధికారులకు రియల్ టైమ్ అలర్ట్‌లు ఇస్తూ, సమస్యలు రాకముందే అప్రమత్తం కావడానికి సహాయపడుతుంది.
పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం 'స్టేట్ డేటా లేక్'ను ఏర్పాటు చేసింది. దీని కింద 41 శాఖలకు చెందిన 55 డేటాబేస్‌లను అనుసంధానించారు. ఈ డేటా విశ్లేషణ ద్వారా ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవకతవకలను గుర్తించారు. దీనివల్ల 17,547 పెన్షన్ అక్రమాలను గుర్తించి, ఏడాదికి రూ.84.22 కోట్ల పొదుపు చేసే అవకాశం లభించింది. అలాగే 1.61 లక్షల మంది మరణించిన వారి పేర్లను రైస్ కార్డ్స్ నుండి తొలగించారు, జగజ్జీవన్ జ్యోతి పథకం కింద 96,000 మంది అనర్హులను, గృహ నిర్మాణ పథకంలో 1.28 లక్షల డూప్లికేట్ మంజూరులను గుర్తించి రివ్యూకు పంపారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో 98 ఏఐ (AI) యూజ్ కేస్‌లను గుర్తించగా, అందులో 29 ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ఇవి టీబీ (క్షయ) వ్యాధి ముందస్తు గుర్తింపు, పంట తెగుళ్ల గుర్తింపు, జీఎస్‌టీ మోసాల గుర్తింపు, ఏఐ-ఆధారిత సీసీటీవీ ఎనలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్నాయి. అధికారుల నిర్ణయాల కోసం 'ఆర్‌టీజీఎస్ లెన్స్', 'రెవెన్యూ వన్', 'సింగిల్ సెర్చ్ బార్' వంటి ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే మూడేళ్లలో ఏఐ లివింగ్ ల్యాబ్స్, 'ఏపీ వన్' (AP One) లాంటి ప్లాట్‌ఫామ్‌లను మరింత విస్తరించి, దేశంలోనే ఏఐ ఆధారిత పరిపాలనకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక రోల్ మోడల్‌గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

