ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పి.పి.కుంట సమీపంలో అర్ధరాత్రి వేళ ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సు విజయవాడ నుండి కడప వైపునకు వెళ్తున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఒక్కసారిగా బోల్తా పడటంతో ప్రయాణికులంతా భయాందోళనలతో కేకలు వేశారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల ద్వారా చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అర్ధరాత్రి వేళ కావడం, డ్రైవర్ నిద్రమత్తు లేదా మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రయాణికుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఏపీలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

