ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ఉపాధి రంగానికి మరింత ఊతం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)' (VB-G RAM-G) సరికొత్త పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె గ్రామంలో ఇవాళ అధికారికంగా ప్రారంభించారు.
ఈ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి కల్పించే కనీస పనిదినాలను గతంలో ఉన్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడమే కాకుండా, కూలీలకు రోజువారీ వేతనాన్ని రూ.312 గా నిర్ణయించి లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యనేతలు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇస్తూ అక్కడ మొక్కలు నాటారు, అలాగే గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరిచే స్వచ్ఛ రథాలను, మురుగునీటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్ల (సోక్ పిట్స్) పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో గ్యాలరీని సందర్శించి, లబ్ధిదారులకు నేరుగా 'VB G-RAM-G' స్మార్ట్ కార్డులను అందజేయడంతో పాటు, పథకం వివరాలతో కూడిన అధికారిక సమాచార పుస్తకాన్ని, ఆన్‌లైన్ డిజిటల్ పోర్టల్‌ను కూడా ఆవిష్కరించారు.

