శనివారం రాత్రి దక్షిణ ముంబైలో జరిగిన ఒక ఉత్సవ కార్యక్రమం విషాదంగా ముగిసింది. స్వాగత కార్యక్రమంలో గణేశ విగ్రహం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ఇద్దరు పిల్లలతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సౌత్ ముంబైలోని బలరామ్ మర్చంట్ రోడ్డులో గల కబూతర్ ఖానా సమీపంలో ఉన్న జయ్ అంబే చౌక్ (భూలేశ్వర్) ప్రాంతంలో ఈ దుర్ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. 'భూలేశ్వరాచ రాజా' గణేష్ విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో పండల్‌కు తీసుకువస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. జనసమర్థంగా ఉన్న ఈ వీధిలో విగ్రహాన్ని మోసుకెళ్తున్న భారీ స్ట్రక్చర్ అకస్మాత్తుగా పక్కకు ఒరిగి కిందపడింది.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి పరుగులు తీశారు. ముంబై ఫైర్ బ్రిగేడ్, ముంబై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సివిక్ వార్డ్ సిబ్బందితో పాటు 108 అంబులెన్స్ సేవలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని క్షతగాత్రులను తక్షణమే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మృతులను 33 ఏళ్ల సంకేత్ నేవ్‌షే , 30 ఏళ్ల బ్రిజేష్ హేమంత్ జోషిగా అధికారులు గుర్తించారు. ఇక గాయపడిన ఐదుగురిలో వైభవ్ ఘెనాండ్ (38), పవన్ చౌరాసియా (25), కునాల్ కాషిద్ (26)లతో పాటు ఇద్దరు చిన్నారులు 5 ఏళ్ల లావణ్య గానేర్, 7 ఏళ్ల దివ్య గానేర్ ఉన్నారు. ప్రస్తుతం గాయపడిన ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని సివిక్ అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించే 10 రోజుల పండుగ 'గణేశోత్సవ వేడుకలకు' ముంబై ముస్తాబవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. పండుగ సమయంలో భక్తులు ఇళ్లలోనూ, పబ్లిక్ పండళ్లలోనూ వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తారు. ముంబైలో విగ్రహాల ఆగమనోత్సవాలు భారీ ఊరేగింపులతో వైభవంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో భూలేశ్వర్‌లో జరిగిన ఈ దుర్ఘటన భక్తుల రద్దీ మధ్య జరిగే మతపరమైన ఊరేగింపుల్లో భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. విగ్రహ నిర్మాణం కూలడానికి గల అసలు కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

