Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ జామ్..కారులో ఉన్న గర్భిణి భార్య కోసం భర్త నిరసన!

గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ జామ్..కారులో ఉన్న గర్భిణి భార్య కోసం భర్త నిరసన!

బెంగళూరు: నగరంలో వీఐపీ సంస్కృతిపై ఒక సామాన్య వాహనదారుడు నడిరోడ్డుపై కూర్చొని వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కాన్వాయ్ సులువుగా వెళ్లేందుకు వీలుగా ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని ఇస్రో జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను దాదాపు అరగంట పాటు నిలిపివేశారు.

ఆ సమయంలో ప్రజ్వల్ అనే వ్యక్తి తన గర్భిణి అయిన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తూ తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయాడు. ఎంతసేపటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విసిగిపోయిన అతను, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కారు దిగి రోడ్డుపై ఉన్న జీబ్రా క్రాసింగ్‌పై బైఠాయించాడు. ట్రాఫిక్ పోలీసులు అతనిని లేవమని కోరుతూ, గవర్నర్ కాన్వాయ్ వస్తోందని, అందుకే వాహనాలు ఆపాల్సి వచ్చిందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

అంతేకాకుండా నిరసన ఆపకపోతే వేరేలా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనికి ఆ వాహనదారుడు తీవ్రంగా స్పందిస్తూ, "మాకు కూడా పనులు ఉన్నాయి.. నా భార్య గర్భవతి, కారులో కూర్చొని ఇబ్బంది పడుతోంది. గవర్నర్ ఇంకా హెచ్ఏఎల్ వేదిక నుండి బయటకే రాలేదు.. అప్పుడే మా ట్రాఫిక్ ఆపేస్తారా?" అని ప్రశ్నించాడు. పోలీసులు ఇది వీఐపీ మూవ్‌మెంట్ అని చెప్పగా.. "కేవలం గవర్నర్ మాత్రమే వీఐపీనా? మేము కాదా? నేను కూడా వీఐపీనే" అంటూ రోడ్డుపై నుండి లేవడానికి నిరాకరించాడు. పరిస్థితి అదుపు తప్పడంతో ట్రాఫిక్ పోలీసులు పెట్రోలింగ్ టీమ్‌ను పిలిపించారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో అతను తన నిరసనను విరమించుకుని కారులోకి వెళ్లగా, గవర్నర్ కాన్వాయ్ వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరించబడింది. ఇదంతా అక్కడి తోటి వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu