Dailyhunt
ఘోర విమాన ప్రమాదం.. ఐదుగురు పికిల్‌బాల్ క్రీడాకారుల మృతి

ఘోర విమాన ప్రమాదం.. ఐదుగురు పికిల్‌బాల్ క్రీడాకారుల మృతి

మెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఒక చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆస్టిన్ నగరానికి నైరుతి దిశలో ఉన్న వింబర్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

అమరిల్లో నుండి న్యూ బ్రాన్‌ఫెల్స్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణిస్తున్న 'సెస్నా 421C' రకానికి చెందిన ఈ విమానంలో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అమరిల్లో పికిల్‌బాల్ క్లబ్‌కు చెందిన క్రీడాకారులుగా గుర్తించారు.

న్యూ బ్రాన్‌ఫెల్స్‌లోని 'క్రాంకీ పికిల్' వేదికగా జరగనున్న టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వీరు బయలుదేరారు. విమానం గాలిలో ఉన్న సమయంలో అసాధారణ రీతిలో ప్రయాణించిందని, ఆ తర్వాత రాడార్ నుండి మాయమైందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వర్గాలు తెలిపాయి. విమానం కూలిన శబ్దాన్ని విన్న స్థానికులు, భూమి కంపించినట్లు అనిపించిందని భయాందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే విమానం పూర్తిగా ధ్వంసమై అందులోని ఐదుగురు మరణించారు.

ఈ విషాద ఘటన నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన టోర్నమెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. శనివారం క్రీడాకారుల స్మృత్యర్థం ప్రార్థన నిర్వహించిన తర్వాతే ఆటను ప్రారంభిస్తామని తెలిపారు. పికిల్‌బాల్ కమ్యూనిటీలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఫెడరల్ అధికారులు ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో వాతావరణం మేఘావృతమై ఉందని సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu