భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు.
సెయింట్ లూయిస్‌లో గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఫాబియానో కరువానాతో జరిగిన హోరాహోరీ ఫైనల్లో అద్భుత పునరాగమనంతో ప్రజ్ఞానంద ఈ ఘనత సాధించాడు.
క్లాసికల్ గేమ్‌ల ముగిసే సమయానికి ప్రజ్ఞానంద 3-9తో ఏకంగా ఆరు పాయింట్ల భారీ లోటుతో నిలిచాడు. అయితే ఫైనల్ రోజున ప్రజ్ఞానంద అనూహ్య రీతిలో పుంజుకున్నాడు. వరుసగా రెండు ర్యాపిడ్ గేముల్లోనూ కరువానాపై విజయాలు సాధించి స్కోరును 11-9కి మార్చాడు. ఆ తర్వాత జరిగిన మొదటి బ్లిట్జ్ గేమ్ డ్రాగా ముగియగా, రెండో గేమ్‌ను కరువానా గెలవడంతో స్కోరు 12-12తో సమమైంది. వెంటనే తేరుకున్న భారత గ్రాండ్‌మాస్టర్, మూడో బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి గేమ్‌లో టైటిల్ కోసం కేవలం డ్రా చాలిన దశలో, గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ 'త్రీఫోల్డ్ రిపీటీషన్' ద్వారా డ్రా చేసుకుని విజేతగా నిలిచాడు.
ఈ విజయంపై ప్రజ్ఞానంద స్పందిస్తూ, "నిజం చెప్పాలంటే ఉదయం ఆరంభంలో నాకు అవకాశాలు ఉన్నాయని అనుకోలేదు. ఆరు పాయింట్ల లోటును పూడ్చడం చాలా కష్టం. కరువానా లాంటి దిగ్గజ ఆటగాడిపై ఒక మ్యాచ్ గెలవడమే పెద్ద విషయం, అలాంటిది ర్యాపిడ్‌లో రెండు గేమ్‌లు గెలవడం కీలక మలుపుగా మారింది. గత ఏడాదితో పోలిస్తే నా ర్యాపిడ్, బ్లిట్జ్ ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది" అని పేర్కొన్నాడు. మొత్తం ఆరు గేమ్‌లలో ప్రజ్ఞానంద మూడింటిలో గెలిచి, రెండింటిని డ్రా చేసుకుని, ఒక దాంట్లో మాత్రమే ఓటమి చవిచూశాడు.

