ఉత్తర తెలంగాణ ప్రజలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలను మరింత చేరువ చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వరంగల్‌లో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాన్ని (Regional Cancer Centre) ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ రీజినల్ క్యాన్సర్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని, ఈ ఏడాది చివరినాటికి ఇది అందుబాటులోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు చారిత్రక ఎంజీఎం (MGM) ఆసుపత్రిలో 9 కొత్త సూపర్ స్పెషాలిటీ సేవలు, సంతాన్ సాఫల్య కేంద్రం (IVF Centre) ప్రారంభించనున్నట్లు తెలిపారు. రీజినల్ కంటి ఆసుపత్రిలో అడ్వాన్స్‌డ్ ఐ-కేర్ సేవలతో పాటు, ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్తగా డయాలసిస్ కేంద్రాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు కార్పొరేట్ వైద్యం కోసం హైదరాబాద్‌పై ఆధారపడే అవసరం లేకుండా స్థానికంగానే అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

