హైదరాబాద్ నగరంలో వరదలు ముంచెత్తడానికి నాలాలపై ఏర్పాటు చేసిన కాంక్రీట్ స్లాబులే ప్రధాన కారణమని హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
సోమవారం ఆయన కొండాపూర్‌లోని జూబ్లీ గార్డెన్స్, శంషాబాద్, అత్తాపూర్, రామ్‌దేవ్‌బాబా నగర్ ప్రాంతాలలో పర్యటించి వరద ముంపు పరిస్థితులను పరిశీలించారు. నాలాలను పూర్తిగా కాంక్రీట్ స్లాబులతో మూసివేయడం వల్ల లోపల పూడిక, చెత్త పేరుకుపోయి నీరు ముందుకు సాగక లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నాలాల పరిశుభ్రత కోసం ప్రతి మూడు మీటర్లకు ఒకచోట తెరిచే వీలుండేలా (యాక్సెస్) సిస్టమ్ ఉంటే పూడికతీత పనులు సులువవుతాయని, అందుకే జూబ్లీ గార్డెన్స్ పరిసరాల్లో నాలాలపై ఉన్న కాంక్రీట్ స్లాబులను హైడ్రా సిబ్బంది తొలగించి పెద్ద ఎత్తున పూడికతీత పనులు చేపడుతున్నారని తెలిపారు.
మీనాక్షి టవర్స్ సమీపంలో ఉండాల్సిన 2.15 మీటర్ల వరద కాలువ ఆక్రమణల వల్ల 1.5 మీటర్లకు తగ్గిపోవడం, అలాగే వరద నీటిని నేరుగా మొండికుంట చెరువులోకి మళ్లించకుండా మురుగునీటి వ్యవస్థతో అనుసంధానం చేయడం వల్ల జూబ్లీ గార్డెన్స్ ముంపునకు గురవుతోందని అధికారులు గుర్తించారు. అలాగే రామ్‌దేవ్‌బాబా నగర్ వద్ద తప్పుడు ఇన్‌లెట్ల (Inlets) వల్ల వరద నీరు ఊరకుంటలోకి వెళ్లకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై నిలిచిపోతోందని, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 265 వద్ద మీర్ ఆలం ట్యాంక్‌లోకి వెళ్లాల్సిన ఇన్‌లెట్లు పూడికతో మూసుకుపోయాయని తెలిపారు. పిల్లర్ నంబర్ 191 వద్ద మూసీ నదిలోకి వెళ్లే డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించారు. నాలాలలో పూడికతీత కోసం అవసరమైన చోట స్లాబులను తొలగించాలని, భవిష్యత్తులో ఓపెన్ నాలాలపై స్లాబులకు బదులు గ్రిల్స్ (ఇనుప జాలీలు) ఏర్పాటు చేయాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.

