హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్యు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ట్రాఫిక్ సిగ్నల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, 'అనలాగ్' సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మన్ మరియు 'మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్' (MEIL) మేనేజింగ్ డైరెక్టర్ పి. కృష్ణా రెడ్డిలతో భేటీ అయ్యారు. అడ్వాన్స్‌డ్ సెన్సార్లు, రోబోటిక్స్‌తో కూడిన 'ఫిజికల్ ఇంటెలిజెన్స్' ద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన 'కాగినిటివ్ సిటీ' (తెలివైన నగరం)గా హైదరాబాద్‌ను మార్చేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు.
ప్రస్తుతం నగరంలో నడుస్తున్న ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్ట్ వివరాలను వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ ఒత్తిడి, భారీ వర్షాల వంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సిగ్నల్ టైమింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. అలాగే ఎమర్జెన్సీ సమయాల్లో అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్ల కోసం గ్రీన్ కారిడార్‌ను ఈ సిస్టమ్ స్వయంగా క్లియర్ చేస్తుంది. కేవలం ట్రాఫిక్ మాత్రమే కాకుండా, స్మార్ట్ యుటిలిటీస్ కింద పైపుల లీకేజీలను ముందుగానే గుర్తించడం, విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించడం వంటి వాటికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.

