హైదరాబాద్‌లోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్ పరిసరాల్లో కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో 14 రోజుల పాటు పొడిగించారు.
ఇక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ, వర్షపు నీటి కాలువ (స్టార్మ్ వాటర్ డ్రైన్) నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అధికారిక ప్రకటన విడుదల చేశారు. వర్షాకాలంలో ఈ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా జీహెచ్‌ఎంసీ/సిఎంసి అధికారులు శాశ్వత పరిష్కారంగా ఈ పనులను చేపట్టారు.
ఈ పనులు కొనసాగుతున్న దృష్ట్యా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు. మై హోమ్ మంగళా అపార్ట్‌మెంట్స్ నుండి వైశాలీనగర్ అండర్‌పాస్ మీదుగా హఫీజ్‌పేట్ వెళ్లే వాహనాలు మై హోమ్ మంగళా టీ-జంక్షన్ వద్ద యూ-టర్న్ తీసుకుని రాఘవేంద్రనగర్ కాలనీ, హై-టెన్షన్ రోడ్డు, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం, హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ రోడ్డు నుండి వైశాలీనగర్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కూడా మై హోమ్ మంగళా టీ-జంక్షన్ వద్ద రాఘవేంద్రనగర్ కాలనీ, హై-టెన్షన్ రోడ్డు, ఆర్టీఏ ఆఫీస్, హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్ మరియు ఆల్విన్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
మరోవైపు మై హోమ్ జువెల్ వెనుక గేట్, ఆర్టీసీ కాలనీ మంజీరా పైప్‌లైన్ రోడ్డు నుంచి రాఘవేంద్రనగర్ లేదా మై హోమ్ మంగళా వైపు వచ్చే వాహనాలు పైప్‌లైన్ రోడ్డు మీదుగా వెళ్లి హఫీజ్‌పేట్ ఆర్‌వోబీ, జెన్‌పాక్ట్ వద్ద ఎడమవైపు తిరిగి కొండాపూర్-ఆల్విన్ జంక్షన్ రోడ్డు, ప్రభుత్వ పాఠశాల వద్ద యూ-టర్న్ తీసుకుని హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా కొండాపూర్, రాఘవేంద్రనగర్ వైపు వెళ్లాలి. వాసవి లేక్ సిటీ, హఫీజ్‌పేట్ లేక్ వైపు నుంచి వచ్చే వాహనాలు స్పైర్ వన్ అపార్ట్‌మెంట్స్ వద్ద యూ-టర్న్ తీసుకుని హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్, జెన్‌పాక్ట్, కొండాపూర్ రోడ్డు మీదుగా రాఘవేంద్రనగర్ చేరుకోవచ్చు. గోపాల్ నగర్ ఓల్డ్ హఫీజ్‌పేట్ నుంచి వచ్చేవారు హఫీజ్‌పేట్ ఆర్‌యూబీ వద్ద కుడివైపునకు తిరిగి కొండాపూర్ రోడ్డు, స్కూల్ యూ-టర్న్, హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా ప్రయాణించాలని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

