Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్: ఓపెనింగ్‌కు సిద్ధమైన రెండు కీలక ఫ్లైఓవర్లు!

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్: ఓపెనింగ్‌కు సిద్ధమైన రెండు కీలక ఫ్లైఓవర్లు!

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

బుధవారం రోజున మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కాలేరు వెంకటేష్‌లతో కలసి ఆయన నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ మరియు మూసారాంబాగ్ వంతెనను పరిశీలించారు. చంచల్‌గూడ జైలు నుండి ఒవైసీ ఆసుపత్రి వరకు విస్తరించి, చంపాపేటకు అదనపు అనుసంధానంతో దాదాపు రూ. 680 కోట్ల వ్యయంతో ఈ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రెండు కీలక వంతెనల నిర్మాణాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో వేగవంతం చేశారని, త్వరలోనే వీటిని సీఎం చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రులు తెలిపారు. ఈ బ్రిడ్జిల ప్రారంభంతో సంతోష్ నగర్, చంచల్‌గూడ జైలు ప్రాంతం, సైదాబాద్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు గమ్యస్థానాలను చేరుకోవడానికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జిలకు సంబంధించి మిగిలిన అప్రోచ్ రోడ్లను కూడా మరింత వెడల్పు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో కెబిఆర్ పార్క్ సమీపంలో ఫ్లైఓవర్ పనులు కూడా అత్యంత వేగంగా జరుగుతున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో వాహనాల రద్దీని, ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతోందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతో పాటు ప్రయాణం సులభతరం అవుతుందని అన్నారు. నగరవ్యాప్తంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్న ప్రధాన జంక్షన్లు, రద్దీ ప్రాంతాలను నిరంతరం గుర్తిస్తున్నామని, ప్రజల సౌకర్యార్థం అనుకూలమైన ప్రదేశాలలో కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu