హైదరాబాద్‌లో అక్రమ మైనింగ్, కాలుష్య కారక యూనిట్లపై హైడ్రా (HYDRA) మంగళవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించి ఉక్కుపాదం మోపింది. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న 12 RMC ప్లాంట్లు, 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లను అధికారులు నేలమట్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (PCB) నివేదికల ఆధారంగా గండిపేట మండలం వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ పరిధిలో ఈ భారీ ఆపరేషన్ నిర్వహించారు. బడా సంస్థలైన గ్రేట్ ఇండియా మైనింగ్, పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్, పృథ్వి స్టోన్ క్రషర్, రాఘవ స్టోన్ క్రషర్ వంటి సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించి వాటిని డిస్మాంటల్ చేశారు.
ఈ అక్రమ యూనిట్ల వల్ల వాతావరణం విపరీతంగా కలుషితం కావడమే కాకుండా, బండరాళ్ల పేలుళ్లతో స్థానిక నివాసాలకు ముప్పుగా పరిణమించాయి. గతంలో మైనింగ్ శాఖ హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో హైడ్రా నేరుగా రంగంలోకి దిగి యంత్ర సామగ్రిని పూర్తిగా తొలగించింది. ఈ సంస్థలు ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు బాకీ పడి.. కరెంటు కట్ చేసినా డీజిల్ ఇంజన్లతో యూనిట్లను నడిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో మళ్లీ అక్కడ కార్యకలాపాలు నిర్వహించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

