హైదరాబాద్ వేదికగా ఆదివారం (ఆగస్టు 30) ప్రతిష్టాత్మక 'NMDC హైదరాబాద్ మారథాన్- 14వ ఎడిషన్' జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌ను పురస్కరించుకుని హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పలు కీలక మార్గాల్లో తెల్లవారుజామున 4:00 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
ఈ మారథాన్‌ను ఫుల్ మారథాన్ (42.195 కి.మీ), హాఫ్ మారథాన్ (21.097 కి.మీ), 10కే రన్ (10 కి.మీ) విభాగాల్లో నిర్వహించనున్నారు.
పరుగు సాగే మార్గాలు:
ఫుల్ & హాఫ్ మారథాన్: నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం 5:00 గంటలకు ప్రారంభమై.. జూబ్లీహిల్స్, రోడ్ నెం.45, కేబుల్ బ్రిడ్జ్, ఐటీసీ కోహినూర్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ట్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్ మీదుగా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు చేరుకుంటాయి.
10కే రన్: మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్ నుంచి ప్రారంభమై.. న్యాక్ (NAC) మెయిన్ గేట్, సీఐఐ (CII) జంక్షన్, టెక్ మహీంద్రా, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా సాగి బాలయోగి స్టేడియం (గేట్ నెం.1) వద్ద ముగుస్తుంది.
కీలక ట్రాఫిక్ డైవర్షన్లు:
షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి లింగంపల్లి వైపు: ఖాజాగూడ జంక్షన్, నానక్‌రామ్‌గూడ, గోపన్‌పల్లి మీదుగా మళ్లిస్తారు.
లింగంపల్లి నుంచి మెహిదీపట్నం వైపు: మసీద్‌బండ టి-జంక్షన్ వద్ద బొటానికల్ గార్డెన్, అంజయ్య నగర్, ఓఆర్‌ఆర్ (ORR) మీదుగా ఖాజాగూడ జంక్షన్‌కు పంపుతారు.
కొండాపూర్, కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు: అంజయ్య నగర్, రోలింగ్ హిల్స్, దుర్గం చెరువు మీదుగా దారి మళ్లింపు ఉంటుంది.
ఇకేయా (IKEA) జంక్షన్, విప్రో జంక్షన్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్‌మొహర్ జంక్షన్, కొత్తగూడ ఫ్లైఓవర్ వై-జంక్షన్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్‌ను ఔటర్ రింగ్ రోడ్ (ORR), ఓల్డ్ ముంబై హైవే, హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.
భారీ వాహనాలపై నిషేధం:
మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, కొల్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ఉదయం 5:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు లారీలు, డీసీఎంలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ వాహనాలు, వాటర్ ట్యాంకర్ల వంటి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. క్యాబ్, ఆటోలు ఈ మార్గాల్లో పికప్, డ్రాప్‌లు పెట్టుకోవద్దని పోలీసులు సూచించారు. వాహనదారులు ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకుని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

