తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కొన్ని రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండనున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
బేగంపేట, అమరావతి వాతావరణ కేంద్రాల తాజా బులెటిన్‌ల ప్రకారం.. తెలంగాణలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఏపీలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
తెలంగాణలో జూలై 31 ఉదయం నుండి రాగల 24 గంటలు అత్యంత కీలకం కానుండటంతో.. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్ సహా పలు ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగస్టు 4 నుంచి 6 వరకు మాత్రం వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాబోయే వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఐదు రోజుల పాటు గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆగస్టు 4 నుంచి 6 వరకు వాతావరణం సాధారణ స్థితికి చేరుకుని అక్కడక్కడ స్వల్ప జల్లులు మాత్రమే పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

