రంగారెడ్డి జిల్లాలో ఓ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులంతా దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరి ఆనందంగా గడుపుతుండగా..
ఊహించని పరిణామం ఆనందాన్ని కాస్తా విషాదంగా మార్చింది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో గుండెపోటుతో ఓ పూర్వ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొత్త బ్రహ్మణపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 1997-1998 సంవత్సరంలో కలిసి చదువుకున్న విద్యార్థులు తాజాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్టు 2న ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసుకున్నారు. చిన్ననాటి మిత్రులంతా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా మారింది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారంతా గంటల తరబడి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా గడిపారు.
అయితే ఈ వేడుకలు ముగింపు దశలో డాన్స్ చేస్తుండగా పూర్వ విద్యార్థుల్లో ఒకరైన జెల్ల యాదగిరి (42) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు యాదిగిరి స్వగ్రామం కొత్త బ్రహ్మణపల్లి కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య మాధురి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

