Dailyhunt
Hyderabad: కన్నకూతురిపై అత్యాచారం.. తండ్రికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు

Hyderabad: కన్నకూతురిపై అత్యాచారం.. తండ్రికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించిన కోర్టు

హైదరాబాద్‌లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. కన్నకూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్, గంపాల బస్తీలో నివసించే అస్గర్ అలీ (37) అనే కూలీ, తన 15 ఏళ్ల మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2019లో బతుకుదెరువు కోసం ఈ కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చింది. నిందితుడు మద్యానికి బానిసై తరచూ భార్యాపిల్లలను వేధించేవాడు.

గతేడాది మే నెలలో తన పెద్ద కుమార్తెపై అస్గర్ అలీ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రి బెదిరింపుల వల్ల బాధితురాలు ఈ విషయాన్ని మొదట బయటపెట్టలేదు. అయితే, చిన్న కుమార్తె ద్వారా విషయం తెలుసుకున్న తల్లి, బాధితురాలిని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మే 6, 2025న బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో జీడిమెట్ల పోలీసులు కేసు (క్రైమ్ నం. 484/2025) నమోదు చేశారు. నిందితుడిని మే 8, 2025న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును విచారించిన మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి కె. వెంకటేష్, నిందితుడు అస్గర్ అలీని దోషిగా నిర్ధారించారు. భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టం కింద నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమే కాకుండా, రూ. 35,000 జరిమానా విధించారు. అలాగే, బాధితురాలికి రూ. 3,00,000 పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu