హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత బాధాకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న రీఛార్జ్ విషయంలో జరిగిన గొడవ ఒక యువతి ప్రాణం పోవడానికి దారితీసింది.
కుత్బుల్లాపూర్ ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న కిరణ్మయి (26) అనే యువతి శుక్రవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కిరణ్మయికి గతంలో వివాహమై మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన ఆమె, కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తోంది.
ఈ క్రమంలో వెంకటేష్ అలియాస్ చందు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, గత ఏడాది కాలంగా ప్రశాంత్‌నగర్‌లో అతనితో కలిసి సహజీవనం చేస్తోంది. రెండు రోజుల క్రితం కిరణ్మయి మొబైల్ ఫోన్ రీఛార్జ్ గడువు ముగిసిపోయింది. తనకి ఇంకా జీతం రాకపోవడంతో రీఛార్జ్ చేసుకోలేకపోయింది. తనతో కలిసి ఉంటున్న వెంకటేష్‌ను రీఛార్జ్ చేయమని కోరగా, అతను కూడా చేయించలేదు. ఈ చిన్న విషయంపై శుక్రవారం వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిరణ్మయి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
మృతురాలి తల్లి తన కూతురి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ వెంకటేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి మనస్పర్థలు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రాణాలు తీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి లేదా ఆందోళన కలిగినప్పుడు ధైర్యంగా ఉండి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోండి. ఉచిత కౌన్సెలింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయక కేంద్రాలను సంప్రదించవచ్చు.

