Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: సూరారంలో 6 నెలల పాప కిడ్నాప్‌ సుఖాంతం

Hyderabad: సూరారంలో 6 నెలల పాప కిడ్నాప్‌ సుఖాంతం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు నెలల బాలిక కిడ్నాప్ కేసును సూరారం పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు..

ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, పాపను సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన శ్రీదేవి అనే మహిళ మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె ఆడపడుచుకు (తమ్ముడి భార్యకు) పిల్లలు లేకపోవడంతో తీవ్ర బాధలో ఉండేది. ఎలాగైనా ఆమె కళ్లలో ఆనందం చూడాలనుకున్న శ్రీదేవి, ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి ఆమెకు ఇవ్వాలని అక్రమ మార్గాన్ని ఎంచుకుంది.

ఈ క్రమంలోనే మే 4వ తేదీన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న 6 నెలల ఆడపిల్లను శ్రీదేవి అపహరించింది. ఈ కిడ్నాప్ కోసం ఆమె ఒంటరిగా కాకుండా, మెహదీపట్నంలోని రాయల్ ఫంక్షన్‌హల్‌లో క్యాటరింగ్ బాయ్స్‌తో డీల్ కుదుర్చుకుంది. శ్రీదేవితో పాటు క్యాటరింగ్‌లో పనిచేసే కార్తీక్, జాన్సన్, మరో ఇద్దరు మైనర్లు ఈ నేరంలో భాగస్వాములయ్యారు. వీరంతా కర్ణాటకలోని బీదర్‌కు చెందినవారు కాగా, ప్రస్తుతం రాజేంద్రనగర్ ప్రాంతంలో నివసిస్తూ క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నారు.

పాప కిడ్నాప్ అయినట్లు ఫిర్యాదు అందడమే ఆలస్యం.. సూరారం పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసి, 48 గంటల వ్యవధిలోనే రాజేంద్రనగర్ డెయిరీ ఫార్మ్ వద్ద ఐదుగురు నిందితులను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు నెలల బాలికను క్షేమంగా రక్షించారు. నిందితులను విచారించిన అనంతరం పాపను సురక్షితంగా తల్లికి అప్పగించడంతో ఈ కిడ్నాప్ డ్రామా సుఖాంతమైంది. తక్కువ సమయంలో కేసును ఛేదించి పాపను కాపాడిన పోలీసులను స్థానికులు, ఉన్నతాధికారులు అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu