Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఉచిత కుట్టుమెషీన్లు.. ప్రారంభమైన లబ్ధిదారుల ఎంపిక!

ఇందిరమ్మ ఉచిత కుట్టుమెషీన్లు.. ప్రారంభమైన లబ్ధిదారుల ఎంపిక!

హైదరాబాద్: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఇంటింటా ఇందిరమ్మ' ఉచిత కుట్టుమెషీన్ల పథకానికి విశేష స్పందన లభించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద కుట్టుమెషీన్ల కోసం సుమారు 4.80 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు బీసీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగస్టు 13న ఈ పథకాన్ని ప్రారంభించి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 30 వరకు గడువు ముగిసేసరికి భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1.19 లక్షల కుట్టుమెషీన్లను 100 శాతం సబ్సిడీపై ఉచితంగా అందించనున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 29,500 దరఖాస్తులు రాగా.. తర్వాతి స్థానాల్లో నిజామాబాద్ (26,961), జగిత్యాల (26,784), సిద్దిపేట (24,600), కరీంనగర్ (23,500) జిల్లాలు నిలిచాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో మాత్రం దరఖాస్తుల సంఖ్య తక్కువగా నమోదైంది.

ప్రస్తుతం దరఖాస్తుల గడువు ముగియడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గాలు, మండలాల వారీగా ఎంపీడీవోలు అర్హులను గుర్తించి జాబితాను కలెక్టర్లకు సమర్పిస్తారు. మరోసారి సమగ్ర పరిశీలన తర్వాత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రికి పంపి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎంపిక ప్రక్రియకు సుమారు రెండు నెలలు పట్టే అవకాశం ఉండగా, నవంబర్ 19న లేదా డిసెంబర్ 9న కుట్టుమెషీన్ల పంపిణీ చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు కుట్టుమెషీన్ల సరఫరా కోసం టెండర్ల దాఖలు గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు. ఉషా, సింగర్, బ్రదర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఈ టెండర్ల రేసులో ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu