Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంజినీర్ల మాట వినకపోవడంతోనే కాళేశ్వరం "కూళేశ్వరం"గా మారింది..!

ఇంజినీర్ల మాట వినకపోవడంతోనే కాళేశ్వరం "కూళేశ్వరం"గా మారింది..!

కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

ఇంజినీర్ల మాట వినకపోవడంతో కాళేశ్వరం "కూళేశ్వరం"గా మారిందన్నారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ సర్కార్ అవినీతి అందరికీ తెలిసిందేనన్నారు. ఇంజినీర్లను కూడా పక్కకు పెట్టి నేనే ఇంజినీరును అంటూ కేసీఆర్ నియంతృత్వ పోకడలతో కాళేశ్వరం నాణ్యత దెబ్బతిని కూళేశ్వరంగా మారిందన్నారు. కాళేశ్వరాన్ని వారం అప్పగిస్తే నీళ్లు ఇస్తాం అని చెబుతున్న కేటీఆర్ తొమ్మిదిన్నర ఏండ్లలో ఏమి చేశారో చెప్పాలన్నారు. కాళేశ్వరంలో వారి అవినీతితో ప్రాజెక్టుకే ముప్పు ఏర్పడిందన్నారు.

వర్షాభావంతో నీళ్లు లేని సమయంలో సముద్రంలోకి నీళ్లు వదులుతున్నారంటూ కేటీఆర్ చేస్తున్న ప్రకటనలు ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనం అన్నారు. అవినీతితో కాళేశ్వరాన్ని కేసీఆర్ ప్రభుత్వం కూల్చివేస్తే దాన్ని కాంగ్రెస్ కాపాడుతోందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యత అనుమానాస్పదంగా ఉన్నాయనే వాస్తవం కేటీఆర్‌కు తెలియదా..? నాణ్యతా లోపంతో ఉన్న ప్రాజెక్టులో పంపులు ఆన్ చేస్తే ఏమవుతుందో కేటీఆర్‌కు తెలియదా..? అని ప్రశ్నించారు.

గతంలో కేసీఆర్ కూడా తాను ఇంజినీరు అంటూ గొప్పలకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లేకుండా చేశారని.. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అహంభావంతో అవగాహన లేకుండా పంపులు ఆన్ చేయమని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్‌డీఎస్ఏ, సీడబ్ల్యుసీ అనుమతులు లేకుండా బ్యారేజీలు నిర్వహించడం ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడడమేనన్నారు.

ఎన్‌డీఎస్ఏ బ్యారేజీ పైపింగ్, పునాదుల్లో లోపాలను గుర్తించిందని.. వాటిని సరి చేయకుండా నీటిని నిల్వ చేయడం అశాస్త్రీయం.. ప్రమాదకరం అన్నారు. త్వరలోనే సాంకేతిక పరీక్షలతో ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు, ప్రజాధానాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభత్వం ప్రాధాన్యతిస్తుందన్నారు. మీలాగే హడావుడి నిర్ణయాలు తీసుకొని అశాస్త్రీయమైన పనులు చేపట్టం అన్నారు.

ప్రజల నీళ్ల సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకుని ఆశాస్త్రీయంగా, అక్రమంగా అడ్డగోలుగా ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా చేసిన దౌర్భాగ్యం మీది కాదా అని మండిపడ్డారు. వారం రోజుల్లో నీళ్లు ఇస్తామంటున్న కేటీఆర్, తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అక్రమాలపై పశ్చాతపం వ్యక్తం చేస్తే బాగుంటుందని.. లేకపోతే ప్రజలు బీఆర్ఎస్ నేతలను తరిమి కొట్టడం ఖాయం అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu