Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియాగాంధీ ఎంట్రీ.. తొలి  పోస్ట్ వైరల్!

ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియాగాంధీ ఎంట్రీ.. తొలి పోస్ట్ వైరల్!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అధికారికంగా అడుగుపెట్టారు.

తన జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకం ఫస్ట్ లుక్‌ను ఈ సందర్భంగా ఆమె తన తొలి పోస్ట్‌గా పంచుకున్నారు. ఆమె ఖాతా ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్లు చేరారు. ఈ ఖాతాలో ఆమె కేవలం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ అధికారిక ఖాతా అనే మూడింటిని మాత్రమే ఫాలో అవుతుండటం విశేషం.

తన తొలి పోస్ట్‌లో సోనియా గాంధీ స్పందిస్తూ.. "అందరికీ నమస్కారం, ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' మొదటి లుక్ ఇది. ఇది ప్రేమ, బాధ్యత, కోల్పోవడం, మనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకోవడం గురించిన కథ. దీనిని మీతో పంచుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రాసుకొచ్చారు. పోస్ట్ చేసిన వీడియోలో ఆమె ఎంతో ఉత్సాహంగా 544 పేజీల తన పుస్తకం కవర్‌ను అన్‌వ్రాప్ చేసి చూస్తూ కనిపించారు. పేజీలు తిరగేస్తూ రాహుల్, ప్రియాంకల చిన్ననాటి అరుదైన ఫోటోలు ఉన్న పేజీ వద్ద ఆగి, పక్కనే ఉన్న ప్రియాంక గాంధీతో ముచ్చటించడం ఆ వీడియోలో కనిపించింది. ఈ పుస్తకం నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ముందుకు రానుంది.

ఈ ఆత్మకథ ప్రచురణ ప్రక్రియ గతంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. పుస్తకంలోని కొన్ని అంశాలపై "ఎడిటోరియల్ మార్పులు" చేయాలంటూ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (PRHI) ప్రతిపాదించగా, సోనియా గాంధీ బృందం అంగీకరించకపోవడంతో ఆగస్టులో ఆ సంస్థ దీనిని ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆరెస్సెస్, భారత్-చైనా సంబంధాలకు సంబంధించిన అంశాలను తొలగించాలని పెంగ్విన్ కోరిందని, ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గే భావప్రకటన స్వేచ్ఛను హరించారని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది. అయితే బాహ్య ఒత్తిళ్లు ఏమీ లేవని పెంగ్విన్ స్పష్టం చేసింది. వివాదాల అనంతరం ఇప్పుడు ఈ పుస్తకాన్ని హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురిస్తుండగా, అంతర్జాతీయంగా మాత్రం ఆల్‌ఫ్రెడ్ ఎ. నాఫ్ సంస్థ విడుదల చేస్తోంది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి కాలంలో ఇటలీలో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలు, భారతదేశానికి రావడం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో వివాహం వంటి వ్యక్తిగత విషయాలన్నీ ఈ ఆత్మకథలో చోటుచేసుకున్నాయి. అలాగే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యల వల్ల ఎదురైన తీరని విషాదాలు, అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిన పరిస్థితులు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా 2004 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఘనవిజయం సాధించినప్పటికీ, ప్రధాని పదవిని త్యాగం చేయడానికి గల కారణాలను సైతం సోనియా గాంధీ ఈ పుస్తకంలో వెల్లడించనున్నట్లు సమాచారం. దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు అత్యంత కీలక పాత్ర పోషించిన నాయకురాలి అనుభవాలతో కూడిన ఈ పుస్తకంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu