Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జగ్గారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట.. క్రిమినల్ కేసు రద్దు

జగ్గారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట.. క్రిమినల్ కేసు రద్దు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2021లో పోలీసుల అనుమతి లేకుండా నిరసన ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలతో నమోదైన క్రిమినల్ కేసును హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావు జగ్గారెడ్డి దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణకు ముగింపు పలికినట్లైంది.

ఈ కేసు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో 2021లో నమోదైన క్రైమ్ నం.38/2021కు సంబంధించినది. భారతీయ శిక్షాస్మృతిలోని అక్రమ గుంపుగా చేరడం, అల్లర్లు, ప్రజా మార్గానికి ఆటంకం కలిగించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు హైదరాబాద్‌లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కేసుల ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉంది.

ఈ కేసు 2021 జనవరి 19న జరిగిన కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, అలాగే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ 'రాజ్‌భవన్ ఛలో' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పాత ఏపీ సచివాలయం సమీపం నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించగా, పోలీసుల అనుమతి లేకుండానే నిరసన చేపట్టారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు.

ఈ కేసులో జగ్గారెడ్డితో పాటు అప్పటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్పటి ఎంపీ ఎ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, మహ్మద్ షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతల పేర్లను కూడా పోలీసులు చేర్చారు. తాజాగా హైకోర్టు జగ్గారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు విచారణను రద్దు చేసింది. దీంతో ఈ కేసులో జగ్గారెడ్డికి చట్టపరంగా ఊరట లభించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu