ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'జనాగ్రహ సభ'కు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.
తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ప్రధాని రాకను విమర్శిస్తూనే, ఆమె చేసిన వ్యక్తిగత మరియు రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ నేతల తీరును ఎద్దేవా చేస్తూ కొండా సురేఖ ఘాటు విమర్శలు చేశారు. "బీజేపీ నేతలు మీటింగ్ పెట్టి కేవలం 'జై శ్రీరామ్' అంటే పైనుండి ఏమైనా పైసలు పడతాయా? మనకేమైనా కొత్త పథకాలు వస్తున్నాయా?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కేవలం భక్తి పేరుతో నినాదాలు చేయడం తప్ప, తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కానీ, విభజన హామీల గురించి కానీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆమె మండిపడ్డారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపడం లేదని ఆమె ధ్వజమెత్తారు.
ప్రధాని పర్యటనలో భాగంగా రూ. 7 వేల కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కేవలం నామమాత్రమేనని, అది కంటితుడుపు చర్య అని ఆమె అభివర్ణించారు. మోదీని రాష్ట్రానికి తీసుకురావడం, ఆయనతో హిందీలో నాలుగు మాటలు చెప్పించి పంపడం తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. అయితే, దేవాదాయ శాఖ మంత్రే 'జై శ్రీరామ్' నినాదాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తన పదవిని మర్చిపోయి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ముందే కాంగ్రెస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంది.

