హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక వేధింపుల కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్టకు చెందిన జితేందర్ రెడ్డి అలియాస్ జతిన్‌ను అదుపులోకి తీసుకుని, అతనిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికతో జతిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను నమ్మించి జూబ్లీహిల్స్‌లోని ఒక డ్రైవ్-ఇన్ ప్రాంతంలో కలుసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం మియాపూర్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బాలికకు తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీశాడు.
ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను నిందితుడు తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానని బెదిరించి, ఆమె నుంచి సుమారు రూ.2.48 లక్షలు వసూలు చేశాడు. జతిన్‌తో పాటు అతని స్నేహితులు కూడా ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని బాలికను వేధించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
నిందితుల వేధింపులు భరించలేకపోయిన సదరు మైనర్ బాలిక ఇటీవల ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ "రిచ్ కిడ్స్ ట్రాప్" వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు జతిన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

