Dailyhunt
జూన్‌ 15లోపు యూనిఫాంలు, పుస్తకాల పంపిణీ.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

జూన్‌ 15లోపు యూనిఫాంలు, పుస్తకాల పంపిణీ.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని సకాలంలో, నాణ్యంగా అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా శాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలలకు అవసరమైన వస్తువుల కొనుగోలు కోసం కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని (Centralized Procurement) అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో శాఖల వారీగా విడివిడిగా కొనుగోలు చేయడం వల్ల ఏకరూపత లోపించడమే కాకుండా అక్రమాలు జరిగేవని, కొత్త విధానంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.

విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, ట్రాక్ సూట్లు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసుల వంటి ప్రతి వస్తువు అత్యున్నత నాణ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. జూన్ 15 నాటికి విద్యార్థులందరికీ సామగ్రి చేరాలని, పంపిణీ పూర్తయిన వెంటనే సరఫరాదారులకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సరఫరాదారుల ప్రయోజనాల కంటే విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని, గ్రామ స్థాయిలోని పాఠశాలలు మరియు హాస్టళ్లకు పంపిణీ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. పంపిణీ ప్రక్రియను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరచాలని, వస్తువుల నాణ్యతపై నేరుగా విద్యార్థుల నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక కమిటీని నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu