హైదరాబాద్: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను ఎత్తివేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాలు ఎంతో కీలకమైనవని, ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
స్టే కారణంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులందరికీ నిబంధనల ప్రకారం వెంటనే ఆర్థిక సాయం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడికీ అన్యాయం జరగకుండా ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
గతంలో కోర్టు స్టే విధించినప్పుడు కొందరు రాజకీయ స్వార్థంతో పథకాలే రద్దయినట్లు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు తలెత్తినప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఎందుకు సంబరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు.

