Dailyhunt
కవల పిల్లలకు వేర్వేరు తండ్రులు.. డీఎన్ఏ పరీక్షలో వెలుగులోకి షాకింగ్ నిజం

కవల పిల్లలకు వేర్వేరు తండ్రులు.. డీఎన్ఏ పరీక్షలో వెలుగులోకి షాకింగ్ నిజం

కే తల్లికి జన్మించిన కవలలకు ఇద్దరు వేర్వేరు తండ్రులు ఉండటం సాధ్యమేనా? వినడానికి వింతగా ఉన్నా.. బ్రిటన్‌లో నివసించే మిచెల్ (49), లావినియా ఓస్బోర్న్ (49) విషయంలో ఇదే నిజమని తేలింది.

1976లో నాటింగ్‌హామ్‌లో కేవలం నిమిషాల వ్యవధిలో జన్మించిన ఈ సోదరీమణులు, తాము కవలలమే కానీ తమ తండ్రులు వేర్వేరు అని డీఎన్ఏ పరీక్షల ద్వారా తెలుసుకుని విస్తుపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు వేళ్లమీద లెక్కించదగ్గవి మాత్రమే ఉండగా, బ్రిటన్‌లో నమోదైన మొదటి కేసు ఇదే కావడం గమనార్హం.

జీవశాస్త్రంలో దీనిని 'హెటెరోపటర్నల్ సూపర్ ఫెకండేషన్' (Heteropaternal Superfecundation) అని పిలుస్తారు. ఒకే రుతుచక్రంలో స్త్రీ విడుదల చేసిన రెండు అండాలు, వేర్వేరు వ్యక్తుల శుక్రకణాలతో ఫలదీకరణం చెందినప్పుడు ఇలాంటి అరుదైన కవలలు జన్మిస్తారు. దశాబ్దాలుగా ఈ విషయం తెలియని ఆ సోదరీమణులు, 2022లో సరదాగా ఇంట్లోనే చేసుకునే డీఎన్ఏ కిట్ ద్వారా ఈ నిజాన్ని తెలుసుకున్నారు. చిన్నతనంలో కష్టాల్లో పెరిగిన ఈ ఇద్దరికీ మిచెల్ తల్లి మరణించిన రోజే ఈ ఫలితాలు రావడం గమనార్హం.

మొదట మిచెల్ తన డీఎన్ఏను పరీక్షించుకోగా, చిన్నప్పటి నుండి తండ్రిగా భావిస్తున్న వ్యక్తితో ఆమెకు సంబంధం లేదని తేలింది. తదుపరి విచారణలో ఆమె అసలు తండ్రి 'అలెక్స్' అని తెలిసింది. అయితే సోదరి లావినియా పరీక్ష చేయించుకోగా, ఆమె తండ్రి అలెక్స్ కాదని, 'ఆర్థర్' అనే మరో వ్యక్తి అని తేలింది. దీంతో వారిద్దరూ ఒకే తల్లికి పుట్టిన 'హాఫ్ సిస్టర్స్' (సవతి సోదరీమణులు) అని స్పష్టమైంది. ఈ విషయం తెలుసుకున్నప్పుడు తాము కొంత దిగ్భ్రాంతికి గురైనప్పటికీ, ఒకే గర్భంలో పెరిగి ఇన్నేళ్లు కలిసి ఉన్న తమ మధ్య ఉన్న 'కవలల' బంధం ఎప్పటికీ విడదీయలేనిదని ఆ సోదరీమణులు భావోద్వేగంతో చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu