Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్రంపై అన్నామలై సంచలన ట్వీట్.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్!

కేంద్రంపై అన్నామలై సంచలన ట్వీట్.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్!

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలపై ఢిల్లీ పోలీసులు చేపట్టిన కఠిన చర్యలు, ముందస్తు అరెస్టుల చట్టబద్ధతను ఆయన సూటిగా ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంలో నిరసనకారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై 'విదేశీ ఏజెంట్లు' అని ముద్ర వేస్తున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు.

సీజేపీ నిరసన వ్యూహాలతో తాను ఏకీభవించనప్పటికీ, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నామలై స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి 5 కీలక ప్రశ్నలను సంధించారు. సీజేపీ దరఖాస్తు చేసుకోగానే జంతర్ మంతర్‌ను నిరసన వేదిక జాబితా నుంచి ఎందుకు తొలగించారు? స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ల అధికారాల పరిధి ఏమిటి? అక్టోబర్ 13న అరెస్టయిన వారికి బెయిల్ నిరాకరించడం, ఎనిమిది మంది పూచీకత్తులను తిరస్కరించడం ఎంతవరకు న్యాయం? అలాగే నీట్ ఆందోళనల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పెల్లెట్ గన్లను ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే అరెస్టయిన నేతలను మేజిస్ట్రేట్ విడుదల చేశారని గుర్తుచేశారు.

అంతేకాకుండా, బీజేపీని ఎద్దేవా చేస్తూ అన్నామలై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "బీజేపీ నిజంగానే సీజేపీని వ్యతిరేకిస్తోందా? లేక దానికి ఉచితంగా ప్రచారం కల్పిస్తోందా? సీజేపీని ఒక ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టి విపక్షాల ఓట్లను చీల్చాలని చూస్తోందా? డబ్బులిచ్చినా సీజేపీకి ఇంతకంటే మంచి పబ్లిసిటీ టీమ్ దొరకదు" అని విమర్శించారు. కొందరు బీజేపీ నేతలు తన వైఖరిని ప్రశ్నించడంపై స్పందిస్తూ.. తాను 2026 జూన్ 5నే బీజేపీని వీడానన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

అన్నామలై ద్వంద్వ వైఖరి బయటపడింది: బీజేపీ కౌంటర్

అన్నామలై వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ప్రతిస్పందించింది. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ.. పార్టీని వీడిన తర్వాత అన్నామలై తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారని, ఆయన ద్వంద్వ ప్రమాణాలు బయటపడ్డాయని విమర్శించారు. గతంలో ఓటరు జాబితాల సవరణ (SIR)కు అనుకూలంగా మాట్లాడి, ఇప్పుడు సీజేపీ, కాంగ్రెస్‌లకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. చట్టపరిధి దాటినప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడం సహజమని, స్వయంగా మాజీ ఐపీఎస్ అధికారి అయ్యుండి శాంతిభద్రతల విధులను ఆయన ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని తిరుపతి చురకలంటించారు. ఒక ప్రజాప్రతినిధిగా, మాజీ పోలీసు అధికారిగా నిలకడైన వైఖరి ఉండాలని హితవు పలికారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu