Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మానవాళికి ముప్పుగా 'పాదరస కాలుష్యం'.. ప్రపంచ నిపుణుల ఆందోళన!

మానవాళికి ముప్పుగా 'పాదరస కాలుష్యం'.. ప్రపంచ నిపుణుల ఆందోళన!

హైదరాబాద్: మానవ ఆరోగ్యంపై పాదరసం (మెర్క్యూరీ) చూపుతున్న తీవ్ర దుష్ప్రభావాలు, ముప్పులపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, విధానకర్తలు, పరిశ్రమల ప్రముఖులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా పాదరస కాలుష్యం సవాళ్లను చర్చించేందుకు 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మెర్క్యురీ యాజ్ ఎ గ్లోబల్ పొల్యూటెంట్' (ICMGP) సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు హైదరాబాద్‌లో జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) నివేదికల ప్రకారం.. మానవ కార్యకలాపాల కారణంగా పర్యావరణంలో పాదరస స్థాయిలు ఏకంగా 450 శాతం పెరిగినట్లు నిపుణులు వెల్లడించారు. ఆహారం, గాలి, నీటి ద్వారా మానవ శరీరంలోకి చేరుతున్న మెర్క్యురీ మానవ పిండంపై, చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, పెద్దలు, పిల్లల్లో నరాల సంబంధిత లోపాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సౌందర్య సాధనాలు (కాస్మటిక్స్), ఆయుర్వేద మందులు, బంగారు గనులు, భారీ పరిశ్రమలలో పాదరస వాడకాన్ని గుర్తించి తగ్గించడం మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత కీలకమని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం సౌందర్య సాధనాల్లో మెర్క్యురీ వినియోగం పెద్దఎత్తున జరుగుతుండటం పెను ముప్పుగా మారుతోంది. చర్మం రంగును మార్చే వైటెనింగ్ క్రీమ్స్‌లో మెర్క్యురీని వాడటం వల్ల చర్మంలో మెలనిన్ ఉత్పత్తి నిలిచిపోయి తాత్కాలికంగా రంగు తెల్లబడుతుంది. అయితే చెమట గ్రంథులు, వెంట్రుకల రంధ్రాల ద్వారా ఈ భార లోహం శరీరంలోకి ప్రవేశించి కిడ్నీలను దెబ్బతీయడంతో పాటు వణుకు, ఆందోళన, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్, సదస్సు చైర్ ఆసిఫ్ ఖురేషి మాట్లాడుతూ.. యువతకు ఈ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ సినీ నిర్మాత, హక్కుల కార్యకర్త నీనా దవులూరి ఆధ్వర్యంలో ప్రత్యేక పబ్లిక్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేద ఉత్పత్తులలో కూడా సూక్ష్మ పొడి రూపంలో మెర్క్యురీ ఆనవాళ్లు లభిస్తున్నట్లు శాస్త్రవేత్తలు సదస్సులో వివరించారు.

జపాన్‌లోని కుమమోటో ప్రిఫెక్చర్‌కు చెందిన మినమాటా వ్యాధి బాధితుడు ఈ సదస్సుకు ప్రత్యక్షంగా హాజరై తన అనుభవాలను పంచుకోవడం ద్వారా పారిశ్రామిక కాలుష్యం తాలూకు కష్టాలను ప్రపంచ విధానకర్తల దృష్టికి తెచ్చారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఆర్టిసానల్ బంగారు గనులు, చర్మం కాంతివంతం చేసే సౌందర్య సాధనాలు, సాంప్రదాయ ఆయుర్వేద మందులలో మెర్క్యురీ, సీసం మోతాదులపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. కాలుష్య నివారణకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను క్షేత్రస్థాయిలో విధానాలుగా ఎలా మలచాలనే అంశంపై సదస్సులో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu