Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి..ఇంట్లోనే శవమై తేలిన వైనం!

మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి..ఇంట్లోనే శవమై తేలిన వైనం!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిష్టి ముఖర్జీ ఘటక్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె విగతజీవిగా కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇంట్లోని రెండో అంతస్తు గదిలో బ్రిష్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం రాంపూర్‌హాట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఉన్నతాధికారులు తెలిపారు.

కుటుంబ వివాదాలు, ఒత్తిడి కారణమా?

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, బ్రిష్టి గత కొన్నేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడి (డిప్రెషన్)తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. అటు భర్తతో కూడా విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. గతంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఆమె అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నియామకాల్లో అక్రమాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆమె ఆ ఉద్యోగాన్ని కోల్పోయినట్లు కుటుంబీకులు తెలిపారు.

వరుస ఘటనలతో కలకలం

రాంపూర్‌హాట్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు సీనియర్ టీఎంసీ నేత, బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది రోజులకే ఈ ఘటన వెలుగుచూడటం తీవ్ర సంచలనం రేపుతోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా మాజీ సీఎం మమతా బెనర్జీ మేనకోడలు కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu