తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన నివాసంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు (రిగ్గింగ్) పాల్పడిందని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ ఎన్నికల ఫలితాలను, ప్రజాతీర్పును తాము అంగీకరించేది లేదని స్పష్టం చేస్తూ.. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు.
ఈ రాజకీయ పోరాటాన్ని న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొనేందుకు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి చంద్రిమా భట్టాచార్య, ఇతర సహచరులు తిరిగి లాయర్లుగా కోర్టుల్లో తమ న్యాయ ప్రాక్టీస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. న్యాయస్థానాల వేదికగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె తెలిపారు. స్థానికంగా కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, తమ ప్రధాన లక్ష్యం మాత్రం ఢిల్లీ పీఠమేనని.. కేంద్రంలో 'ఇండియా' (INDIA) కూటమి ఒకే తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుందని ఆమె నొక్కి చెప్పారు.
మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అక్రమ మార్గాల్లో దొంగిలించబడిన ఈ ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా, ఒక నిరసన రూపంలోనే తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఎంసీ యువనేత అభిషేక్ బెనర్జీ చేసిన కృషిని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అభిషేక్ బెనర్జీ సైతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థిస్తూ.. అధికారంలో కొనసాగడమే తాము ఎన్నికల ప్రక్రియపై చూపే నిరసన అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ సవాల్ విసురుతూ.. చేతనైతే కేంద్రం బెంగాల్‌పై రాష్ట్రపతి పాలన (President's Rule) విధించుకోవచ్చని, అయితే అది అధికారిక రికార్డుల్లోకి ఎక్కాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసను అరికట్టేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు మమతా బెనర్జీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. గెలిచిన తృణమూల్ అభ్యర్థులందరూ వెంటనే తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. స్థానికంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూసే పూర్తి బాధ్యతను ఆయా ఎమ్మెల్యేలకే అప్పగించారు. అలాగే, పార్టీ సాంస్కృతిక అస్తిత్వాన్ని, పోరాట పటిమను చాటిచెప్పేలా.. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాల్లో 'రవీంద్ర సంగీతం' (Rabindra Sangeet) ప్లే చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

