న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం వెల్లడించింది.
సాధారణంగా జూన్ 1 నాటికే రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ, ఈసారి కాస్త ఆలస్యమైంది. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లోకి రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతకుముందు మే 26నే రుతుపవనాలు వస్తాయని భావించినప్పటికీ, అవి ఆలస్యం కావడంతో జూన్ మొదటి వారంలో ప్రవేశిస్తాయని ఐఎండీ సవరించిన అంచనాను ప్రకటించింది.
అయితే, ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ సీజన్‌లో దీర్ఘకాలిక సగటు (LPA)లో కేవలం 90 శాతం మేరకే వర్షపాతం కురిసే అవకాశం ఉందని, సాధారణంగా 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే దానిని "లోటు వర్షపాతం"గా పరిగణిస్తారని తెలిపింది. 1971 నుండి 2020 వరకు ఉన్న గణాంకాల ప్రకారం భారత దేశ సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉంది. ఈసారి వర్షాలు తగ్గడానికి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న 'ఎల్ నినో' (El Nino) పరిస్థితులే ప్రధాన కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం సాధారణంగా ఉన్న పసిఫిక్ వాతావరణం ఎల్ నినో వైపు మారుతోందని.. ఇది జూన్ నెలలో బలహీనంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్ నాటికి మధ్యస్థం నుండి చాలా బలంగా మారే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

