పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో కలకలం రేపిన అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాష్ మండల్ తల్లి బుధవారం నాడు మాట్లాడుతూ.. తన కుమారుడు చేసిన పనులకు శిక్ష అనుభవించాల్సిందేనని, అందుకే అతని మృతదేహాన్ని స్వీకరించబోనని చెప్పారు.
మీడియాతో మాట్లాడుతూ నిందితుడి తల్లి ఇలా అన్నారు, "ఇద్దరు పోలీసులు మా ఇంటికి వచ్చారు. అప్పటికే నేను నిద్రలేచాను. నా కొడుకు చనిపోయాడని వారు నాకు చెప్పారు, అలాగే ఆసుపత్రికి వెళ్లాలనుకుంటున్నారా అని అడిగారు. నా భర్త అనారోగ్యంతో ఉన్నందున నేను వెళ్లలేనని వారికి చెప్పాను. వాళ్లకు నచ్చింది చేసుకోమని నేను చెప్పాను.. నాకేమీ అభ్యంతరం లేదు. నా కొడుకు తన పనులకు తగిన శిక్షను అనుభవించాడు. నేను అతని మృతదేహాన్ని తీసుకోను. అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకురాను. వాడు ఏ మంచి పనీ చేయలేదు.. తప్పు చేశాడు, దానికి తగిన శిక్షను పొందాడు. వాడిని చంపేయండి లేదా మీకు నచ్చింది ఏదైనా చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. నేను వాడి మృతదేహాన్ని తీసుకోను" అని కూడా అన్నారు.
బరుయిపూర్ అత్యాచారం, హత్య కేసులో విచారణలో భాగంగా నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తుండగా జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో ప్రభాష్ మండల్ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల్ ఒక అధికారి వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించి, పోలీసు బృందంపై కాల్పులు జరిపాడు.
బరుయిపూర్ ఎస్పీ మాట్లాడుతూ.. "నేరం జరిగిన తీరును పునఃసృష్టిస్తున్న సమయంలో అతను పోలీసుల నుంచి ఆయుధాన్ని లాక్కొని వారిపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. దానికి ప్రతిగా పోలీసులు కాల్పులు జరపగా, ఆ బుల్లెట్ ప్రభాస్‌కు తగిలింది. ఆసుపత్రిలో అతను మరణించినట్లు ప్రకటించారు."
విచారణ సమయంలో మండల్ దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాడని, దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. జూలై 4న అదృశ్యమైన 12 ఏళ్ల బాలిక మృతదేహం, మరుసటి రోజు సూర్యపూర్ హాట్ ప్రాంతంలోని ఒక చెరువులో లభ్యమైంది.
ఆ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేశాక ఆమె మృతదేహాన్ని ఒక సంచిలో పడేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. ఆగ్రహించిన స్థానికులు బరుయిపూర్-జయనగర్ రహదారిని దిగ్బంధించి, టైర్లను తగలబెట్టడంతో పాటు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

