సంచలనం సృష్టించిన మోడల్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విషా అత్త, మాజీ జిల్లా న్యాయమూర్తి అయిన గిరిబాలా సింగ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే, గురువారం మధ్యాహ్నం సీబీఐ అధికారులు భోపాల్‌లోని ఆమె నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన నటి, మాజీ 'మిస్ పుణె' ట్విషా శర్మకు భోపాల్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగింది. పెళ్లైన ఐదు నెలలకే, మే 12న భోపాల్ లోని తన అత్తగారి ఇంట్లో ట్విషా ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనపై మే 15న పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
వరకట్న వేధింపులు, గృహహింస, సాక్ష్యాధారాలను తారుమారు చేశారనే తీవ్రమైన ఆరోపణలతో ట్విషా భర్త సమర్థ్ సింగ్‌తో పాటు అత్త గిరిబాలా సింగ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ, దర్యాప్తును వేగవంతం చేసింది. ట్విషా భర్త సమర్థ్ సింగ్ ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నాడు. మే 15న భోపాల్‌లోని కింది (సెషన్స్) కోర్టు మాజీ జడ్జి అయిన గిరిబాలా సింగ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బుధవారం రాత్రి మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవనారాయణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ బెయిల్‌ను రద్దు చేసింది. సాక్షుల వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్‌లు, పోస్టుమార్టం నివేదిక (మృతదేహంపై తల, చేతులపై ఉన్న ఆరు గాయాలు), అబార్షన్ చేయించుకోవాలని ట్విషాపైన తెచ్చిన ఒత్తిడి వంటి కీలక ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండానే కింది కోర్టు బెయిల్ మంజూరు చేసిందని హైకోర్టు తప్పుపట్టింది. నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు బెయిల్‌ను కొట్టివేసింది.

