శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి నయా జోష్ వచ్చింది. టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన గుండ లక్ష్మీదేవి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.
ఈ సందర్భంగా గుండ లక్ష్మీదేవికి వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు.
గుండ లక్ష్మీదేవి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. ఆమె భర్త, దివంగత మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్లుగా పనిచేశామని, తన భర్త నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో పనిచేశారన్నారు. నాటి విలువలు, సిద్ధాంతాలు, మంచి విధానాలు ఇప్పుడు ఆ పార్టీలో లేవని, తన భర్త విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. విలువల్లేని టీడీపీలో ఉండలేకే వైఎస్సార్సీపీలో చేరుతున్నానని ఆమె తెలిపారు.

