హైదరాబాద్: తమ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనప్పటికీ శాసనమండలి (MLC) సభ్యత్వానికి రాజీనామా చేసేది లేదని మిర్జా రహమత్ బేగ్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.
బహిష్కరణ వేటు తర్వాత ఆయన తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు.
డీప్‌ఫేక్ వీడియోలతో బ్లాక్‌మెయిల్: రహమత్ బేగ్
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై బేగ్ స్పందిస్తూ.. తన ప్రతిష్టను దిగజార్చేందుకే డీప్‌ఫేక్, మార్ఫింగ్ వీడియోలను సృష్టించి వైరల్ చేశారని ఆరోపించారు. ఈ తరహా ఫేక్ వీడియోలతో గుర్తుతెలియని వ్యక్తులు తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారని, దీనిపై ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనకు తప్పక న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఉమ్రా తీర్థయాత్రకు వెళ్లి శనివారం (ఆగస్టు 29) నగరానికి తిరిగి వచ్చానని స్పష్టం చేశారు. పార్టీ సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.
ఎంఐఎం వేటు.. ప్రతిపక్షాల ఆగ్రహం
క్రమశిక్షణారాహిత్యం కారణంతో రహమత్ బేగ్‌ను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు, ఆయన శాసనమండలి చైర్మన్‌కు రాజీనామా సమర్పించాలని ఏఐఎంఐఎం శనివారం ఒక ప్రకటనలో ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు సమగ్ర విచారణకు డిమాండ్ చేశాయి. కేవలం పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన సరిపోదని, అసలు నిజాలను వెలికితీసేందుకు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శక దర్యాప్తు జరిపించాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ డిమాండ్ చేశారు.

