చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో బుధవారం రాత్రి అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న విషయానికి తలెత్తిన వివాదంలో, తనను చూసి నవ్వాడన్న ఆగ్రహంతో కన్నతండ్రినే ఓ కొడుకు కత్తితో గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. మాణిక్యరాయునిపల్లె గ్రామానికి చెందిన చెంగారెడ్డి (55)కి జోకేష్ రెడ్డి, హేమచంద్రారెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు జోకేష్ రెడ్డి ఎల్లంపల్లె సమీపంలోని గ్రావెల్ ఫ్యాక్టరీలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య చూడామణి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, వీరు పెనుమూరులో కాపురం ఉంటున్నారు. జోకేష్ రెడ్డి తరచూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడి వేధించేవాడు. బుధవారం రాత్రి కూడా మద్యం మత్తులో భార్యను వేధించడంతో.. విసిగిపోయిన ఆమె మామ చెంగారెడ్డికి ఫోన్ చేసింది. "మీ అబ్బాయి తాగి వచ్చి మమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నాడు, వచ్చి బుద్ధి చెప్పి తీసుకువెళ్లండి" అని మొరపెట్టుకుంది.
ఈ క్రమంలో భార్య చేతిలోని ఫోన్ లాక్కున్న జోకేష్ రెడ్డి, తండ్రితో మాట్లాడుతూ స్వయంగా తానే బైక్‌పై మాణిక్యరాయునిపల్లెకు వస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత గ్రామానికి చేరుకున్న జోకేష్ రెడ్డి తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో తండ్రి చెంగారెడ్డి తనను చూసి నవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జోకేష్ రెడ్డి, వెంట తెచ్చుకున్న కత్తితో తండ్రి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

