ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరియు గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారత్‌లో సరికొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.
ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారులకు ప్రతినెల ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేయడానికి ఈ రెండు దిగ్గజ సంస్థలు చేతులు కలిపాయి. భారతదేశంలో ఒక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మరియు ఓటీటీ దిగ్గజం మధ్య ఇటువంటి పార్టనర్‌షిప్ కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ భాగస్వామ్యం ద్వారా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus) సభ్యులు ప్రతినెల రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన నాలుగు ఆర్డర్లను పూర్తి చేస్తే చాలు, ఉచితంగా 30 రోజుల పాటు 'నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్' సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఒకే క్యాలెండర్ నెలలో ఈ నాలుగు ఆర్డర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ కోర్ మార్కెట్ ప్లేస్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ (Grocery) మరియు క్విక్ కామర్స్ విభాగమైన ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ (Flipkart Minutes) ద్వారా చేసే ఆర్డర్లు కూడా దీనికి వర్తిస్తాయి. అర్హత సాధించిన వెంటనే ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోనే నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఉచిత ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు కానివారు ఏడాదిలో 15 ఆర్డర్లు పూర్తి చేయడం ద్వారా ఈ ఆఫర్‌కు అర్హత సాధించవచ్చు.
ఇప్పటివరకు టెలికాం రీఛార్జ్ ప్యాక్‌లు లేదా అదనపు చెల్లింపుల ద్వారా మాత్రమే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లభించేవి. అయితే, వినియోగదారులు రోజూ చేసే నిత్యావసరాల షాపింగ్‌నే ఓటీటీ రివార్డ్‌గా మార్చడం ద్వారా క్విక్ కామర్స్ మార్కెట్‌లో బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. నెలలో రూ. 299 విలువైన 4 ఆర్డర్లు చేయడం వల్ల ప్రతి యాక్టివ్ యూజర్ నుంచి ఏటా కనీసం రూ. 14,352 బిజినెస్ గ్యారెంటీగా వస్తుందని సంస్థ అంచనా వేస్తోంది.
మరోవైపు, నెట్‌ఫ్లిక్స్‌కు ఈ భాగస్వామ్యం ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి (Tier-2, Tier-3) నగరాల్లోని యువత మరియు మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకు పెద్ద వేదిక లభించనుంది. ప్రత్యక్షంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయడానికి వెనుకాడే వినియోగదారులను, రోజువారీ నిత్యావసరాల షాపింగ్ ఆధారిత రివార్డ్స్ ద్వారా సులభంగా చేరుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌కు ఈ మోడల్ ఉపయోగపడనుంది.

