Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెట్టింట ప్రధాని మోదీ మార్ఫ్ ఏఐ వీడియోలు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు

నెట్టింట ప్రధాని మోదీ మార్ఫ్ ఏఐ వీడియోలు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ (AI) ద్వారా సృష్టించిన మార్ఫ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు మరికొంత మంది సోషల్ మీడియా యూజర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

గ్లోబల్ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌పై భారతదేశంలో నమోదైన అత్యంత హైప్రొఫైల్ కేసుల్లో ఇది ఒకటిగా నిలిచింది.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మెటాకు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ తప్పుదోవ పట్టించే మార్ఫ్ చేసిన వీడియోలు విస్తృతంగా ప్రసారం కావడంతో ఈ కేసు నమోదైంది. ఈ కంటెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించి ఉండే అవకాశం ఉందని, భారతీయన్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏఐ-సృష్టించిన ఈ వీడియోలు ఎక్కడ పుట్టాయి, సోషల్ మీడియా వేదికల ద్వారా అవి ఎలా వైరల్ అయ్యాయి, వాటి సర్క్యులేషన్‌ను అరికట్టడంలో మెటా వద్ద ఉన్న భద్రతా ప్రమాణాలు సరిపోతున్నాయా లేదా అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ తప్పుడు కంటెంట్‌ను సృష్టించిన, అప్‌లోడ్ చేసిన లేదా షేర్ చేసిన వ్యక్తుల పాత్రను కూడా ఈ విచారణలో పరిశీలిస్తారు.

ఏఐ-సృష్టించిన స్కామ్‌లు, నకిలీ ప్రకటనలు, ఇతర మార్ఫ్ చేసిన కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు కంపెనీ అనుసరిస్తున్న విధానాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ప్రతినిధులకు సమన్లు జారీ చేసిన కొన్ని రోజులకే ఈ ఎఫ్‌ఐఆర్ వెలువడడం గమనార్హం. ఈ నేపథ్యంలో మెటా ప్రతినిధి ఒకరు విచారణ అధికారుల ఎదుట హాజరై కంపెనీ కంటెంట్ మోడరేషన్, కంప్లైయన్స్ చర్యలపై వారికి వివరణ ఇచ్చారు.

ఏఐ-సృష్టించిన తప్పుడు సమాచారం (మిస్‌ఇన్ఫర్మేషన్) సోషల్ మీడియాలో విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, హానికరమైన కంటెంట్ ప్రసారాన్ని అరికట్టడంలో మధ్యవర్తి (ఇంటర్మీడియరీ) ప్లాట్‌ఫారమ్‌ల బాధ్యతపై ఈ కేసు తీవ్రమైన పరిశీలనను తెచ్చిపెట్టింది. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదని పోలీసులు తెలిపారు. డిజిటల్ సాక్ష్యాల సేకరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని వారు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu