అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఒక ఫోన్ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల తీవ్రతను నిరసిస్తూ.. నెతన్యాహుపై ట్రంప్ బూతులతో విరుచుకుపడ్డారని అంతర్జాతీయ మీడియా సంస్థ 'ఆక్సియోస్' (Axios) సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న అత్యంత కీలకమైన చర్చలను ఇజ్రాయెల్ చర్యలు దెబ్బతీస్తున్నాయనే కోపంతో ట్రంప్ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం.. బీరూట్ నగర శివార్లలోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రం చేయడం, దక్షిణ లెబనాన్‌లో భూతల దాడులను విస్తరించడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోన్ కాల్‌లో నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ తీవ్ర పదజాలం ఉపయోగించారని ఇద్దరు ఉన్నతాధికారులు ధృవీకరించారు. "నీకు పిచ్చి పట్టిందా? నేను గనుక లేకపోతే నువ్వు ఈపాటికి జైల్లో ఉండేవాడివి. నేనే నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నీ ప్రవర్తన వల్ల ఇప్పుడు ప్రపంచంలో నిన్నూ, ఇజ్రాయెల్‌ను అందరూ అసహ్యించుకుంటున్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా?" అంటూ నెతన్యాహుపై ట్రంప్ గట్టిగా అరిచినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ చర్యల వల్ల ఆ దేశం అంతర్జాతీయంగా ఒంటరిదవుతుందని, ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా చేస్తున్న దౌత్యపరమైన ప్రయత్నాలకు నెతన్యాహు గండికొడుతున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజ్బుల్లా కమాండర్లను టార్గెట్ చేసే నెపంతో లెబనాన్‌లో పౌరులు పెద్ద సంఖ్యలో చనిపోవడంపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇరాన్ హెచ్చరికలు - రంగంలోకి అమెరికా
హిజ్బుల్లాకు మద్దతు ఇస్తున్న ఇరాన్ సైతం ఇజ్రాయెల్ దాడులపై స్పందించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే.. వాషింగ్టన్‌తో తాము జరుపుతున్న శాంతి చర్చలు నిలిచిపోతాయని ఇరాన్ హెచ్చరించింది. ప్రాంతీయంగా శాంతి నెలకొనాలంటే లెబనాన్‌లో కాల్పుల విరమణే ప్రధానాంశమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇజ్రాయెల్ వైఖరిపై తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది.
వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్ సేనలు?
ట్రంప్ చేసిన హెచ్చరికల ప్రభావం వెంటనే కనిపించింది. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి మళ్లిందని, ఇకపై బీరూట్‌పై దాడులు చేసే ఆలోచన లేదని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) లో స్పందిస్తూ.. "నెతన్యాహుతో నేను జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యం బీరూట్ వైపు వెళ్లడం లేదు. మధ్యవర్తుల ద్వారా హిజ్బుల్లా కూడా దాడులు ఆపేందుకు అంగీకరించింది" అని పేర్కొన్నారు.
ట్రంప్‌తో మాట్లాడిన తర్వాత కూడా నెతన్యాహు మాత్రం తన పంథా మార్చుకోనట్లే సంకేతాలు ఇచ్చారు. దక్షిణ లెబనాన్‌లో తమ సైనిక చర్యలు కొనసాగుతాయని, హిజ్బుల్లా గనుక దాడులు ఆపకపోతే బీరూట్‌పై మళ్లీ విరుచుకుపడతామని నెతన్యాహు స్పష్టం చేశారు. తమ స్థానంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇరాన్, ప్రాంతీయ రక్షణ విషయంలో ట్రంప్, నెతన్యాహు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత లెబనాన్ సంక్షోభం వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలకు దారితీసిందని ఈ ఉదంతం నిరూపిస్తోంది.

