ఇండియా (INDIA) కూటమి నుంచి బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ నిష్క్రమణపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ జరుగుతున్న ఆందోళనలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో నితీశ్ కుమార్ వ్యవహారం చర్చకు రాగా, ఇద్దరు అగ్రనేతల మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది.
సమావేశంలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. "మనం నితీశ్ కుమార్‌ను ఇండియా కూటమి నుంచి వెళ్ళిపోనిచ్చి ఉండకూడదు. ఒకవేళ ఆయన అక్కడే ఉండి ఉంటే నేటి రాజకీయ పరిస్థితి వేరుగా ఉండేది" అని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై సోనియా గాంధీ స్పందిస్తూ భిన్నమైన వాదన వినిపించారు. "దేవుడి దయ వల్ల నితీశ్ కుమార్ సరైన సమయానికి బయటపడి వెళ్ళిపోయారు. ఆయన మొదటి నుంచీ కూటమి నుంచి ఎలా బయటపడాలా అని చూస్తూనే ఉన్నారు" అని సోనియా పేర్కొన్నారు. అంతేకాకుండా, నితీశ్ బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నారని ఆమె ఆరోపించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
గతంలో 2024 జనవరిలో బీహార్‌లోని మహాకూటమి ప్రభుత్వానికి స్వస్తి పలికిన నితీశ్ కుమార్.. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై ఉమ్మడి వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మంగళవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.3 కోట్ల మంది పేర్లను వెంటనే పునరుద్ధరించాలని, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని తీర్మానించింది. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధతను కోల్పోయిందని ఆరోపిస్తూ.. పార్లమెంటులో, న్యాయస్థానాలలో, వీధుల్లో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో సోనియా గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు.

