తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్' (NMMS) 2026-27 విద్యా సంవత్సర దరఖాస్తు గడువు ముగింపు దశకు చేరుకుంది.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 24వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పేదరికం కారణంగా విద్యార్థులు 8వ తరగతి తర్వాత పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేయకుండా ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు మొత్తం నాలుగేళ్ల పాటు ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది. ఇందులో భాగంగా నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12,000 చొప్పున మొత్తం రూ.48,000 ఉపకార వేతనం అందుతుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండి, 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కుల్లో 5 శాతం మినహాయింపు ఉంటుంది.
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT), స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) లతో కూడిన రాత పరీక్ష ద్వారా మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. కాగా, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ స్కూల్స్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. ఎంపికైన వారు సైతం పైచదువులను ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యాసంస్థల్లోనే కొనసాగించాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ఆగస్టు 24తో ముగుస్తున్న నేపథ్యంలో అర్హులైన విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.

