హైదరాబాద్: అనాథలు, నిరుపేదలు, నిస్సహాయ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న విద్యాసంస్థల భవనాలను కూల్చాలనుకుంటే కూల్చుకోవచ్చని, ఒక్కటి కూల్చితే తాను పది భవంతులు నిర్మిస్తానని మజ్లిస్ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు.
పాతబస్తీ బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ కేజీ టు పీజీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో ఆదివారం సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, ఏకరూప దుస్తుల (యూనిఫాం) పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
ముస్లింలలో నిరక్షరాస్యతను దూరం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాననే కారణంతోనే కొందరు వ్యక్తులు తనపై కక్ష గట్టారని అక్బరుద్దీన్ ఆరోపించారు. ఒకవేళ ఆ శక్తులు విద్యాసంస్థల భవంతులను కూల్చివేసినా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని... విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టైనా సరే చదువు చెప్పిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

