పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నరోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో సుమారు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ దారుణ చర్యను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ (MEA), ఘటనపై తక్షణమే పారదర్శక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఇస్లామాబాద్‌ను డిమాండ్ చేసింది.
ఈ విషయమై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. శతాబ్దాల నాటి మైనారిటీల ప్రార్థనా స్థలంపై జరిగిన ఈ విధ్వంసాన్ని తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నామని తెలిపారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించడంలో పాకిస్తాన్ అధికారులు చూపిన ఉదాసీనత, వైఫల్యం అత్యంత ఆందోళనకరమని ఆయన విమర్శించారు. పొరుగు దేశంలో మైనారిటీల మత స్వేచ్ఛ, వారి ఆరాధనా స్థలాల భద్రత ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నాయో చెప్పేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమని మండిపడ్డారు. ధ్వంసమైన ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించడానికి తగిన చర్యలు చేపట్టాలని, దేశంలోని మైనారిటీ పౌరులు, వారి సాంస్కృతిక వారసత్వానికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పాకిస్తాన్ ప్రభుత్వం నెరవేర్చాలని భారత్ గట్టిగా స్పష్టం చేసింది.
కాగా, పక్కనే ఉన్న ఓ మదర్సా విస్తరణ కోసమే మతోన్మాదులు కుట్రపూరితంగా ఈ ఆలయాన్ని కూల్చివేసి ఆక్రమణకు పాల్పడ్డారని స్థానిక మైనారిటీ హక్కుల సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, భారీ వర్షాల వల్లే శతాబ్దాల నాటి ఆలయ నిర్మాణం కూలిపోయిందని పాకిస్తాన్ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ETPB) అధికారులు పేర్కొనడం గమనార్హం.

