Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాక్‌లో భారత ఏజెంట్ల ఆపరేషన్.. 30 మంది టెర్రరిస్టులు హతం?.. లష్కర్ ఉగ్రవాది సంచలన ప్రకటన

పాక్‌లో భారత ఏజెంట్ల ఆపరేషన్.. 30 మంది టెర్రరిస్టులు హతం?.. లష్కర్ ఉగ్రవాది సంచలన ప్రకటన

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. గత మూడు, నాలుగేళ్ల కాలంలో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు లష్కరే తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది బహిరంగంగా అంగీకరించారు.

ఉగ్రవాద సంస్థల మనుగడపై వస్తున్న వార్తల నేపథ్యంలో లష్కరే నుంచి ఈ స్థాయిలో స్పష్టమైన ప్రకటన వెలువడడం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు. రిజ్వాన్ హనీఫ్ అనే వ్యక్తి మే నెలలో చేసిన ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావాలాకోట్ తదితర పాకిస్థాన్ నగరాలలో తమ లష్కరే తోయిబా ఆపరేటర్లు లక్ష్యంగా హత్య చేయబడ్డారని రిజ్వాన్ హనీఫ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 'గత మూడు నుంచి నాలుగేళ్లలో భారత నిఘా సంస్థల ఏజెంట్లు తమకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులను హతమార్చారు' అని అతను ఆరోపించాడు. పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో గత కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తులు జరిపుతున్న కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఈ హత్యల వెనుక భారత్ ఉందని ఆరోపిస్తుండగా, భారత్ ఆ వాదనలను కొట్టిపారేసింది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (PoK) తమ వారు ప్రశాంతంగా జీవించడానికి భారత నిఘా సంస్థలు అస్సలు అనుమతించడం లేదని హనీఫ్ మండిపడ్డాడు. తన ప్రసంగంలో భాగంగా ఇతర మతాలపై విద్వేషపూరిత, కించపరిచే వ్యాఖ్యలు కూడా చేశాడు. తాము కేవలం తమ మతం కోసమే పోరాడుతున్నామని, తమపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో ఉద్భవించిన మార్కజ్-ఉద్-దావా-వల్-ఇర్షాద్ మిలిటెంట్ వింగ్‌గా 1980ల చివర్లో హఫీజ్ మహమ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్, అబ్దుల్లా అజామ్ లష్కరే తోయిబాను స్థాపించారు. సోవియట్ సైన్యం వెనుదిరిగిన తర్వాత ఈ సంస్థ తన దృష్టిని జమ్మూ కాశ్మీర్‌పైకి మళ్లించింది. ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) నుంచి మద్దతు లభిస్తోందని భారత్, అమెరికాతో పాటు ఐక్యరాజ్యసమితి ఇప్పటికే లష్కరేను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu